CURRENT TELUGU MOVIES






LEADER


ఇరవై వేల కోట్లు తినేసిన ఒక ముఖ్యమంత్రి బ్లాస్ట్ కు గురయి ఆస్పత్రిలో చివరి శ్వాస విడుస్తూ తన కొడుకు ముఖ్యమంత్రి కావాలని చెబుతాడు.అమెరికాలో ఒక కంపనీకి ఆధిపత్యం వహిస్తున్న తనయుడు ఆ మాటను ప్రజల కోసం,రాష్ట్రం లోని అవినీతిని నిర్మూలించటం కోసం,కులవ్యవస్థలో కుళ్లిన రాజకీయాలు,అందులోంచి ఒక 'కుటుంబ రాజ్యాన్ని ' ఏర్పరచిన తన పెదనాన్న పధ్ధతిని ఏరి పారేసేందుకు, తన తల్లి రాజకీయవేత్తగా కాక నాయకుడుగా ముందుకు రావాలన్న సందేశం మేరకు ఒక సంకల్పం చేసి ఒక పథకం వేసి ముందుకు వెళతాడు. ఆ వ్యవస్థను అందులోంచే ఎదిరించి రెండవ భాగంలో ఆ వ్యవస్థలోంచి ఇవతలకి వచ్చి ప్రజల మధ్యలోకి వెళ్లి ఎన్నికలు గెలిచి నిజమైన నాయకునిగా నిలబడతాడు.శేఖర్ కమ్ముల గారు రచించి,దర్శకత్వం వహించిన చిత్రం ఇది.
~~~***~~~
మామూలుగా ఆలోచిస్తే ఇది అతి పెద్ద కాన్వాస్.రెండవ సమస్య ఏమిటంటే రాజకీయపరమైన అంశాలు నిత్య జీవితానికి చాలా దగ్గరగా అల్లుకున్నవి.వార్తా పత్రిక రక రకాల వార్తలను,విశ్లేషణలను పొందు పరచినా సెంటర్ స్ప్రెడ్ మీద సంపాదకీయం,కొన్ని ప్రముఖమైన అంశాలను ఉంచుతుంది.మొదటి పేజీ ఆ రోజు ముఖ్యమైన వార్తలను హెడ్ లైనులతో చూపిస్తుంది.
అది వార్తా పత్రికే కానీ నవల కాదు.రెండు గంటల చలన చిత్రం లోకి ఇటువంటి అంశాన్ని ఒక కథగా అల్లాలంటే అది తేలికైన పని కాదు.ముఖ్యంగా స్త్రీ పాత్రలను జోడించి నాయకుడైనా ఒక కుటుంబం,ఒక జీవితం,ఇల్లు వాకిలి ఉంటాయని మరో దృక్పథం చూపాలన్నా మరి కొంత ఆలోచన అవసరం.
ఇందులో గతంలో ఇలాంటి ప్రక్రియలలోకి వెళ్లి సమర్థవంతంగా చిత్రాలను నిర్మించిన సందర్భాలలో రెండు పధ్ధతులు మనకు కనిపిస్తాయి.ఒకటి-ఒక సంచలనం సృష్టించిన వార్త నుంచి ఆ సంఘటనను ప్రదర్శించి అందులోంచి చెప్పదలచుకున్నవన్నీ చెప్పి చివరకు ఆ సంఘటననే ప్రేక్షకుడికి గుర్తు చేసి ఆ వృత్తాన్ని పూర్తి చేయటం.రెండు-కథ నాయకుని గతం-ఒక ఫ్లాష్ బాక్ ద్వారా ఎట్టి పరిస్థితులలో ఏమి చేయాల్సి వచ్చిందో చూపించి చివరకు రాజకీయ చదరంగం ఎలా కదిలి ఎక్కడ నిలబడిందో చూపించటం. ఈ రెండు పధ్ధతులలో ప్రేక్షకుడికి ఒక కథ కనిపిస్తుంది.లీడర్-చిత్రంలో ప్రారంభం సూటిగా ఒక ముఖ్యమంత్రి మీద జరిగిన బాంబు పేలుడుతో జరిగి వరుస పెట్టి అలా కథా నాయకుని నిర్ణయాల మీద సాగిపోవటం కనిపిస్తుంది.ఇటువంటి కథాంశాలలో చుట్టూ జరిగేవి ఎక్కువ.ప్రజలు,మీడియా గోల ఎక్కువ.ఆ ఏబియన్స్ సరిగా రాలేదు.
కథా నాయకుడు ముఖ్యమంత్రి అయి మొదటి సమావేశం జరిపిన వెంటనే ప్రత్యర్థి దాడి జరిగిపోవటం ఈ దర్శకుడు చూపించాడా అని అనిపిస్తుంది.అమ్మాయిల వ్యవహారం మీడియాకు పట్టలేదా అనిపిస్తుంది.చిత్రం రెండవ భాగంలో నరేషన్ వీటి వలన దెబ్బ తిన్నది.పతాక స్థాయిలో పోరాటం లేదు.ఫలితం ముందరే కనిపించేసింది.అది దృశ్య మాధ్యమానికి ఎంత శ్రేయస్కరమో ఆలోచించాలి.
హిందీ చిత్రం 'ఆంధీ ' ఈ విషయంలో కళాఖండం.సమానాంతరంగా రాజకీయ సన్నివేశాలు అలా సాగిపోతూ ఉంటాయి.కళాత్మకంగా కథ ఒక హోటల్ యజమాని జీవితంతో పెనవేసుకుని ముందరకు సాగిపోయి తన భార్య ఎన్నికలలో పోరాడటం దగ్గర క్లైమాక్స్ ఏర్పడుతుంది.ఒక చక్కని అవకాశం-కుటుంబం,కులం,అవినీతి,అందరి ఆశయాలు,ప్రజలలోని వ్యావహారిక స్పందన,వారి స్వార్థం...ఇలా ఎన్నో కలబోసుకుని క్లైమాక్స్ ఒక సవాలుగా వచ్చినప్పుడు చివరి ఘట్టంలో నిజమైన పోరాటం ముందుకు వస్తుంది.చిత్రం లోని లైన్ ఆర్డర్ దెబ్బ తినటం వలన అది జరగలేదు.
రానా లో మంచి కంట్రోల్ ఉన్నది.నటనకు ఒక అప్రోచ్ కనిపిస్తున్నది. మంచి భవిష్యత్తు కనిపిస్తోంది.
~~~***~~~